జర్నలిస్ట్ గోపీకి ఎంపీ వద్దిరాజు నివాళి

జర్నలిస్ట్ గోపీకి ఎంపీ వద్దిరాజు నివాళి

అంతిమయాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ

ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: సీనియర్ జర్నలిస్టు, జనంసాక్షి దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ కూరాకుల గోపీ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం పాపట్‌పల్లికి తరలించారు. గోపీ అకాల మృతి విషయం తెలుసుకున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ నుంచి పాపట్‌పల్లికి చేరుకున్నారు. గోపీ పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, సంఘం ఖమ్మం జిల్లా గౌరవాధ్యక్షుడు కొత్త సీతారాములు, అధ్యక్షుడు శీలంశెట్టి వీరభద్రం, కాంగ్రెస్ నాయకుడు చెరుకూరి శేషగిరిరావు తదితరులు గోపీ పార్థివదేహాన్ని ఉంచిన పాడెను భుజాలపై మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అనంతరం గోపీ కుటుంబ సభ్యులను ఎంపీ రవిచంద్ర, ఆకుల గాంధీ, కొత్త సీతారాములు, శీలంశెట్టి వీరభద్రం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.