ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గ‌ళ‌మెత్తిన ఎన్ఎంయూఏ!

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గ‌ళ‌మెత్తిన ఎన్ఎంయూఏ!

ఈ నెల 20, 21 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా “డిమాండ్స్ డే” నిరసనలు
భోజన విరామ సమయాల్లో గేట్ మీటింగ్స్ నిర్వహణ
ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (ఏపీపీటీడీ) నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20, 21 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా “డిమాండ్స్ డే” కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు వెల్లడించారు. భోజన విరామ సమయాల్లో గేట్ మీటింగ్స్ నిర్వహిస్తూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. సోమ‌వారం న‌గ‌రంలోని ఓల్డ్ బ‌స్టాండ్ ప్రాంగ‌ణంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఏవీ శ్రీనివాస‌రాజు, విజయవాడ జోనల్ అధ్యక్షుడు ఏవీ రామారావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షడు సీహెచ్ రామకృష్ణా రావు, గ‌వ‌ర్న‌ర్‌పేట – 2 డిపో అధ్యక్షుడు ఎన్‌.చంద్ర మోహన్, గ‌వ‌ర్న‌ర్‌పేట‌-1 అధ్యక్షుడు మురళి మాట్లాడారు.

ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులు, సంక్షేమం, సంస్థ పరిరక్షణ కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్‌టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “స్త్రీ శక్తి” పథకంలో అమలవుతున్న “జీరో టికెట్” విధానం కారణంగా కండక్టర్లపై అధిక పనిభారం పడుతోందని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న డీఏలు, బ‌కాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసి, అన్ని కేటగిరీలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

రిటైర్ అయిన, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన సెటిల్మెంట్స్ ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం అమల్లో ఉన్న ఈహెచ్ఎస్ విధానానికి బదులుగా పాత ఆర్‌టీసీ మెడికల్ ఫెసిలిటీస్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ “డిమాండ్స్ డే” కార్యక్రమాలను కార్మికులందరూ విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.