ఆదిలాబాద్ నిప్పుల కుంపటి..!
ఆదిలాబాద్ నిప్పుల కుంపటి..!
- 46.0 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత..!
- వడగాలులతో జనం విల విల
- మరో నాలుగు రోజులు రెడ్ అలర్ట్..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రచండ భానుడి ప్రతాపం నిప్పుల కుంపటి రాజస్తోంది. వేసవి తాపానికి జనం విలవిలలాడుతున్నారు. సోమవారం రికార్డు స్థాయిలో టెంపరేచర్ 46 డిగ్రీలు నమోదయింది . సాధారణం కంటే ఒక్కసారిగా 3-4 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావo ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 13 మండలాల్లో ఈరోజు 45 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు హీట్ వేవ్స్ కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. సాయంత్రం 8 గంటల నుండి రాత్రి వేళల్లో 38 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్, కొమరం భీమ్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్ ప్రధాన కూడళ్లలో జనసంచారం లేక కర్ఫ్యూ వాతావరణం తలపించింది.
ఉట్నూర్ ఏజెన్సీ లోను సాధారణ కూలీలు, అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లే గిరిజనులు ఉదయం ఐదు గంటలకే ఇండ్ల నుండి బయటకు వెళ్లి 11 గంటల లోపు ఇండ్లకు చేరుకుంటున్నారు. ఎండల తాకిడికి పిల్లలు, వృద్దుల పరిస్థితి అగమ్యాగోచరంగా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 ప్రజాప్రాలన ఉత్సవాలకు జనం కండల భయంతో హాజరు కాలేక పోతున్నారు. దీంతో అధికారిక కార్యక్రమాలు మొక్కుబడిగానే కొనసాగుతున్నాయి.
హీట్ వేవ్స్.. రెడ్ అలర్ట్..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడగాలులకు తోడు రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 46 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత ఇదే విధంగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వడదెబ్బ సోకి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 8 మంది మృతి చెందగా, ఎండల తాకిడికి వందలాదిమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను రెడ్ అలర్ట్ ప్రకటించగా, తీక్షణమైన వడగాలుల నేపథ్యంలో మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీరాంపూర్ బెల్లంపల్లి, మందమర్రి సింగరేణి గనుల్లో షిఫ్ట్ పద్ధతిన పనిచేసే కార్మికులు ఎండల తాకిడికి అల్లాడిపోతున్నారు.

