214 centers | అకాల వర్షంలోనూ ఆగని వడ్ల సేకరణ
214 centers | అకాల వర్షంలోనూ ఆగని వడ్ల సేకరణ
అధికారుల పర్యవేక్షణతో వేగం అందుకున్న కొనుగోళ్లు
కలెక్టర్ స్నేహ ప్రత్యేక దృష్టితో క్షేత్రస్థాయి కదలిక
రైతులకు వేగంగా చెల్లింపులు చేస్తున్న యంత్రాంగం
214 కేంద్రాల్లో సమన్వయంతో కొనసాగుతున్న ప్రక్రియ
214 centers | మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అకాల వర్షాల సవాళ్ల మధ్య మహబూబాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్ స్నేహ, ఎస్పీ శబరిష్ నేరుగా పర్యవేక్షణ చేపట్టడంతో కొనుగోలు కేంద్రాల్లో చురుకుదనం పెరిగింది. ధాన్యం నిల్వలు, రవాణా, చెల్లింపుల విషయంలో సమన్వయంతో ముందుకు సాగడం రైతులకు ఊరటనిస్తోంది. దీంతో ప్రారంభంలో ఉన్న ఆందోళన స్థానంలో ప్రస్తుతం సంతృప్తి భావన కనిపిస్తోంది. జిల్లాలో గత నెల 24వ తేదీ నుంచి వరి కొనుగోలు కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. తొలుత నెమ్మదిగా సాగిన ప్రక్రియ ఇటీవల వేగం అందుకుంది. అకాల వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. రైతుల నుంచి ధాన్యం సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

214 centers | జిల్లాలో 214 కొనుగోలు కేంద్రాలు..
ఈ యాసంగిలో జిల్లాలో 1లక్ష 61వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. మొత్తం 3లక్షల 77వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రైతుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా 214 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీసీ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి కేంద్రంలో అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ధాన్యం కొనుగోళ్లలో అంతరాయం లేకుండా ఇప్పటికే 26లక్షల గోనె సంచులను సరఫరా చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా గోదాములకు తరలిస్తున్నారు. రైతుల చెల్లింపులను ఆలస్యం చేయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు రూ. 100 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు- సమాచారం. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరిగింది.
214 centers | రైతులకు ఇబ్బందులు తగ్గాయి..
అకాల వర్షాల సమయంలో అధికారులు వెంటనే స్పందించడం మాకు చాలా ఊరటనిచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం త్వరగా తీసుకోవడంతో రైతులకు ఇబ్బందులు తగ్గాయి. జిల్లా అధికారులు కష్టపడి పనిచేస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది.
- లాలావత్ వాల్య, మల్యాల గ్రామం, సాధు తండా..
అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..
మా ధాన్యం సకాలంలో కొనుగోలు అవుతుందో లేదో మొదట భయం వేసింది. కానీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న కృషి అభినందనీయంగా ఉంది.
- భూక్య సుగుణమ్మ, మల్యాల గ్రామం, భీముని తండా..
CLICK HERE TO READ MORE :May10th | సీఎంల చేతిలోనే.. పోలీస్ పవర్!
