చారిత్రక వైభవానికి వేదికగా మ్యూజియం డే!

చారిత్రక వైభవానికి వేదికగా మ్యూజియం డే!
భావి తరాలకు వారసత్వ సంపదను చేరువచేసేలా కార్యక్రమాలు
నాగరికత వికాసాన్ని తెలియజేసే జ్ఞాన నిలయం.. మ్యూజియం
భావితరాలకు భద్రపరచిన అమూల్య వారసత్వం మ్యూజియం
బహుముఖ ప్రజ్ఞాశాలి సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పర్యాటక రంగ అభివృద్ధి
ఏపీ టీడీసీ ఛైర్మన్ డా. నూకసాని బాలాజీ
జిల్లా కలెక్టర్ కృషితో బాపూ మ్యూజియం కొత్త కళను సంతరించుకుందని వ్యాఖ్య
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: మ్యూజియంలు కేవలం పురాతన వస్తువుల కేంద్రాలు మాత్రమే కాకుండా, నాగరికత వికాసాన్ని ప్రతిబింబించే జ్ఞాన నిలయాలని.. ఈ సంపదను భావితరాలకు విలువైన వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరముందని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ టీడీసీ) ఛైర్మన్ డా. నూకసాని బాలాజీ అన్నారు. భావితరాలకు మన సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదను అందించడంలో మ్యూజియంల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా సోమవారం విజయవాడలోని బాపూ మ్యూజియంలో జిల్లా అధికార యంత్రాంగం.. పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, ఇన్‌టాక్, జిజ్ఞాస ఆర్ట్ వెర్స్, ఆర్టీఐహెచ్, శ్రేయాస్ మీడియాతో పాటు వివిధ సాంస్కృతిక చారిత్రక వారసత్వ సంస్థల సహకారంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.

తొలుత ఏపీ టీడీసీ ఛైర్మన్ డా. నూకసాని బాలాజీ, రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంల కమిషనర్ (ఎఫ్ఏసీ) పి.సురేష్ తదితరులు అధికారులతో కలిసి జాతిపిత మహాత్మాగాంధీతో పాటు పింగళి వెంకయ్య, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. బాపూ మ్యూజియం ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రత్యేక ఫొటో ప్రదర్శనను తిలకించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ టీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ చారిత్రక విశిష్టత భావితరాలకు స్ఫూర్తి పథమని.. చిన్నారులు కేవలం మార్కుల వేటలోనే పడిపోకుండా మన చారిత్రక వారసత్వ వైభవాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎన్నడూలేని విధంగా ఈ రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమాలు బాపూ మ్యూజియంకు కొత్త కళను తీసుకొచ్చాయని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి దార్శనికతతో కృషిచేస్తున్నారన్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
మ్యూజియంలు విజ్ఞాన భాండాగారాలు..
రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ..మ్యూజియంలు విజ్ఞాన భాండాగారాలని, చరిత్ర, సంస్కృతిని సంరక్షించే విజ్ఞాన నిలయాలని పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని.. ఇప్పుడు ఇంత గొప్పగా అంతర్జాతీయ మ్యూజియం డేను నిర్వహించుకుంటున్నామంటే అందుకు కలెక్టర్ గారి కృషే కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మూలాలు తెలసుకొని ముందుకెళ్లినప్పుడే సుస్థిర ప్రగతి సాధ్యమవుతుందని, మన పుస్తకాల్లో చదువుకొన్న చరిత్రను అనుభవించేందుకు మ్యూజియంలు గొప్ప వేదికలని పేర్కొన్నారు. ఈ రోజు ప్రారంభమైన యజ్ఞాన్ని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు.

జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల పండగను ఘనంగా నిర్వహించి హస్తకళాకారులకు చేయూతగా నిలిచామని.. అదేవిధంగా మన ఘన వారసత్వ చారిత్రక సంపదను భావితరాలకు అందించే ఉద్దేశంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెరిటేజ్ ఆన్ కాన్వాస్, నా నగర కథలు, హెరిటేజ్ క్విజ్, హెరిటేజ్ ఫొటోగ్రఫీ వంటి పోటీలు నిర్వహించడంతో పాటు మేధోమథన చర్చలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. బాపూ మ్యూజియంలో ప్రత్యేక గైడెడ్ టూర్లు, లేజర్ షోలు సందర్శకులకు మధురానుభూతులను పంచుతున్నాయన్నారు.

వైబ్రంట్ విజయవాడ, వైబ్రంట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ కమిషనర్ పి.సురేష్ మాట్లాడుతూ.. గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులు మ్యూజియంలు అని.. ఈ వారసత్వ ప్రతీకలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 14 వరకు పురావస్తు మ్యూజియాలు, మ్యూజియం క్షేత్రాలు ఉన్నాయని, వీటి పరిరక్షణకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్‌టాక్) విజయవాడ చాప్టర్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు సాయి పాపినేని మాట్లాడుతూ సంస్థలో ప్రఖ్యాత పరిశోధకులు, నిపుణులు ఉన్నారని.. వారి సహాయంతో బాపూ మ్యూజియంతో పాటు వివిధ చారిత్రక వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి కృషిచేయనున్నట్లు తెలిపారు.
మన గురించి మనం తెలుసుకునేందుకు ఇలాంటి ప్రదేశాలు దోహదం చేస్తాయని.. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా మన ప్రాంత చారిత్రక వారసత్వ ముద్ర స్పష్టం కనిపిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఆర్కియాలజీ డీడీలు ఎం.రామసుబ్బారెడ్డి, ఇషాక్, ఏడీలు ఎస్.వెంకటరావు, కె.నరసింహనాయుడు, శివకుమార్, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బాపూ మ్యూజియంలో చారిత్రక పరిమళాలు..
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా బాపూ మ్యూజియం చారిత్రక వారసత్వ పరిమళాలతో గుబాళించింది. ప్రాచీన కళాఖండాల విశిష్టతను అందరికీ తెలియజేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. జైన, బౌద్ధ, హిందూ విగ్రహాలు, ప్రాక్ – తొలి చారిత్రక యుగం, నాణెలు, శాసనాలు, మధ్య యుగపు కళా దృక్పథాలు, ఆయుధాల గ్యాలరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాక్ చరిత్ర నుంచి 19వ శతాబ్దం వరకు వివిధ కాలాలకు చెందిన కళాఖండాలతో ఉన్న ఏడు గ్యాలరీలను పెద్దఎత్తున ప్రజలు, చారిత్రక ప్రియులు సందర్శించి కొత్త అనుభూతులను సొంతం చేసుకున్నారు.
