ప్రభుత్వాలు మారుతున్న సరైన స్టేడియంలు లేవు
ప్రభుత్వాలు మారుతున్న సరైన స్టేడియంలు లేవు
- కేశపూర్ లో క్రికెట్ మైదానాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; యువత తమ సమయాన్ని ఫోన్లలో వృథా చేయకుండా మైదానాల్లో గడపాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. కేశాపూర్‌లో వైద్యులు అభినవ్, కిరణ్ కుమార్, చైతన్య కుమార్, ప్రశాంత్ రెడ్డి లు ఏర్పాటు చేసిన రాకెట్స్ క్రికెట్ గ్రౌండ్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమని అన్నారు.

వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ యువత కోసం క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో క్రీడా సౌకర్యాలు లేకపోవడం క్రీడాకారులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. సౌకర్యాలు లేకున్నా జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ జిల్లాలో సరైన స్టేడియం లేకపోవడం శోచనీయమని తెలిపారు.
స్టేడియం నిర్మాణ అంశాన్ని తాను ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. యువత డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు. జిల్లాకు స్టేడియం నిర్మాణం కోసం అన్ని పార్టీల నాయకులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, నగర మేయర్ ఉమారాణి, డీసీపీ బస్వారెడ్డి, కేశాపూర్ సర్పంచ్ గంగాధర్, డాక్టర్ మోతీలాల్, బీజేపీ కార్పొరేటర్లు మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.
