కల్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రికలు ఆవిష్కరణ..
గుడివాడ, ఆంధ్రప్రభ : భగవంతుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, జనార్ధన స్వామి, సోమేశ్వర స్వామి వారి కృపతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు.
గుడ్లవల్లేరు మండలంలోని విన్నకోటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి దేవస్థానంలో ఈ నెల 27 నుండి మే 2 వరకు, నందివాడ మండలం పోలుకొండలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 29 నుండి మే 1 వరకు జరగనున్న వార్షిక కల్యాణ మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆదివారం ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు.
రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో ఎమ్మెల్యేను కలిసిన దేవదాయ శాఖ అధికారులు వేడుకల ఏర్పాట్లను వివరించారు. ఉత్సవాలను శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే, కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో కల్యాణ మహోత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా దేవదాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ కల్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవోలు శేఖర్, మురళి, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, జనసేన జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, పలువురు భక్తులు పాల్గొన్నారు.
