గుండాలలో వైద్య సదుపాయాల కోసం అధికారులకు వినతి
గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం సదుపాయం, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని అడిషనల్ కమిషనర్ డాక్టర్ సాయిబాబా, డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్లకు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రాలు అందజేశారు.
ఈ విషయాన్ని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పొంబోయిన ముత్తయ్య తెలిపారు. గుండాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అధికారులు, వైద్యుడు సుదీప్ సమక్షంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలను వివరించిన వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు.
మండల పరిధిలో సుమారు 14 వేల మంది ఆదివాసి, గిరిజన, గిరిజనేతర నిరుపేద ప్రజలు నివసిస్తున్నారని, మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో తగిన వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పోస్టుమార్టం సదుపాయం లేకపోవడంతో సుమారు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో గుండాలలో పోస్టుమార్టం మార్చురీ నిర్మాణం, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
వినతులకు స్పందించిన అధికారులు సమస్యలను పరిశీలించి త్వరలోనే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మండలంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాంకుడోత్ బికోజి (అజయ్), ఎస్కే అబ్దుల్ నబీ, షేక్ కాసిం, గుర్రం పుష్పరాజు, గడ్డం రాజేష్, ఇస్రాజ్, బొంగు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
