US-Iran-Tensions-Trump-Delays-Strike-Middle-East-Crisis | యుద్ధం వాయిదా.. కానీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత ఇంకా చెదరలేదు
US-Iran-Tensions-Trump-Delays-Strike-Middle-East-Crisis | యుద్ధం వాయిదా.. కానీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత ఇంకా చెదరలేదు
- లేక కొత్త యుద్ధ వ్యూహానికి తెరతీశారా?
- హోర్ముజ్ నుంచి గాజా వరకు కొనసాగుతున్న అనిశ్చితి అమెరికా చెబుతున్న కథ ఒకటి.. ఇరాన్ చెబుతున్న కథ మరొకటి!
- ట్రంప్ వెనక్కి తగ్గారా.. లేక వ్యూహం మార్చారా?
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తాత్కాలికంగా వాయిదా పడినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇచ్చారా? హోర్ముజ్ జలసంధి, గాజా యుద్ధం, చైనా పాత్ర, గల్ఫ్ దేశాల ఆందోళనలపై పూర్తి విశ్లేషణ.
US-Iran-Tensions-Trump-Delays-Strike-Middle-East-Crisis | ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి : మధ్యప్రాచ్యం అంటే ప్రపంచానికి ఎప్పుడూ ఉద్రిక్తతల గుట్టే. అక్కడ ఒక్క చిచ్చు రేగినా.. దాని వేడి వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు, ఢిల్లీ నుంచి యూరప్ వరకు అందరికీ తాకుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అమెరికా ఒకవైపు యుద్ధానికి సిద్ధమైంది.. మరోవైపు ఇరాన్ మాత్రం తన వైఖరిలో వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు ఇచ్చింది. కానీ చివరి క్షణంలో డొనాల్డ్ ట్రంప్ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేయడం కొత్త పరిణామాలకు తెరతీసింది. ఈ రోజు చర్చలపై ట్రంప్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇరాన్ ప్రకటన ఎటు వైపు దారితీస్తుందో చూడాలి.
ప్రపంచ రాజకీయాల్లో మరో పెద్ద ఎత్తుగడ మొదలైన కథ.
ట్రంప్ వెనక్కి తగ్గారా.. లేక వ్యూహం మార్చారా? అనేది ప్రపంచ దేశాల్లో ఒక చర్చ సాగుతున్నది. ట్రంప్ ప్రకటనను పైకి చూస్తే.. అమెరికా శాంతికి అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కానీ అమెరికా చరిత్ర చెబుతోంది… యుద్ధాన్ని ఆపడం కూడా కొన్నిసార్లు యుద్ధ వ్యూహంలో భాగమే! తమ సైన్యం సిద్ధంగా ఉంది… కానీ దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం అనే ట్రంప్ మాటల్లో హెచ్చరిక కూడా ఉంది. ఆహ్వానం కూడా ఉంది. అంటే చర్చలు ఫలించకపోతే.. సైనిక చర్యల ఎంపిక ఇంకా అమెరికా చేతిలోనే ఉందని చెప్పకనే చెప్పారు.
సౌదీ ఫోన్.. మారిన సమీకరణాలు
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికర అంశం సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఫోన్ కాల్. ఎందుకంటే గల్ఫ్ దేశాలకు యుద్ధం అంటే కేవలం భద్రత సమస్య కాదు… ఆర్థిక సమస్య కూడా. హోర్ముజ్ జలసంధి మూతపడితే… ప్రపంచ చమురు సరఫరాకు పెద్ద దెబ్బ. ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే సౌదీ, ఖతర్, యూఏఈ దేశాలు అమెరికాకు ఒకే సందేశం ఇచ్చాయి. ముందు చర్చలు జరపండి… తర్వాత యుద్ధం గురించి ఆలోచించండి అని… ట్రంప్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక్కడే అసలు సందేహాలు
అమెరికా చర్చలకు సిద్ధం అంటోంది. కానీ ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం ససేమిరా అంటుంది. ప్రస్తుతం అధికారిక చర్చల ప్రణాళికే లేదు అని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. ట్రంప్ చెప్పిన కథ ఒకటి… ఇరాన్ చెబుతున్న కథ మరోటి. ఇక్కడే అసలు సందేహాలు మొదలవుతున్నాయి. అమెరికా చెబుతున్న ఒప్పందం నిజంగా రూపుదిద్దుకుంటుందా? లేక ఇది ప్రపంచ మార్కెట్లను ప్రశాంతంగా ఉంచేందుకు చేసిన రాజకీయ ప్రకటన మాత్రమేనా? అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంక్షోభంలో అసలు కేంద్రబిందువు హోర్ముజ్ జలసంధే. ప్రపంచంలో సముద్ర మార్గంలో వెళ్లే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తుంది. అందుకే… హోర్ముజ్‌లో ఉద్రిక్తత అంటే… పెట్రోల్ ధరల పెరుగుదల. ద్రవ్యోల్బణం. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి. దిగుమతులపై ఆధారపడే దేశాలకు అదనపు భారం. అందుకే అమెరికా మాత్రమే కాదు… గల్ఫ్ దేశాలన్నీ ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాయి.
గాజాలో మాత్రం గన్ శబ్దాలు ఆగలేదు
ఒకవైపు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తత తగ్గే సూచనలు కనిపిస్తున్నా… మరోవైపు గాజాలో యుద్ధం మాత్రం కొనసాగుతోంది. పాలస్తీనా ప్రజల ప్రాణనష్టం ఇంకా ఆగలేదు. హమాస్ శాశ్వత కాల్పుల విరమణ కోరుతోంది. ఇజ్రాయెల్ తన సైనిక చర్యలు కొనసాగిస్తోంది. ఒక సంక్షోభం చల్లారుతున్నట్లు కనిపిస్తే… మరో సంక్షోభం మరింత తీవ్రమవుతోంది.
చైనా కూడా రంగంలోకి..
చైనా కూడా ఈ అవకాశాన్ని దౌత్యపరంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. స్వతంత్ర పాలస్తీనా రాష్ట్రానికి తమ మద్దతు కొనసాగుతుందని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఇది కూడా అమెరికాకు ఒక పరోక్ష సందేశమే. మధ్యప్రాచ్య రాజకీయాల్లో చైనా తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానాలు దొరకవు
ట్రంప్ దాడిని నిలిపివేయడం అంటే యుద్ధం ముగిసిందని కాదు. ఇరాన్ చర్చలకు వస్తుందా? అమెరికా నిజంగానే దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తుందా? హోర్ముజ్ ప్రశాంతంగా ఉంటుందా? గాజాలో కాల్పులు ఆగుతాయా? ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానాలు లేవు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది…మధ్యప్రాచ్యంలో తుపాకులు కాసేపు మౌనంగా ఉన్నా… రాజకీయ చదరంగం మాత్రం మరింత వేగంగా సాగుతోంది. యుద్ధం వాయిదా పడింది… కానీ ఉద్రిక్తత మాత్రం ఇంకా ముగియలేదు.
