ముప్పు తిప్పలు పెడుతున్న బెంగాల్ టైగర్

  • పులి వేట కోసం అధికారుల మాటు..
  • రిస్క్యూ టీమ్‌తో అప్రమత్తంగా నిరీక్షణ

జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రభ: అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంలోకి వచ్చిన బెంగాల్ టైగర్‌ను సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు, కర్ణాటక రిస్క్యూ టీమ్ ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలాల పరిధిలోని తోటల్లో సంచరిస్తూ అధికారులకు ముప్పు తిప్పలు పెడుతున్న ఈ పెద్దపులి సోమవారం జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం శివారులోని జల్లేరు వాగు సమీపంలోని పామాయిల్ తోటలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.

పులి అక్కడే ఉండటంతో రోజంతా అధికారులు అప్రమత్తంగా కాపలా కాశారు. మరోవైపు పులిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండటంతో వారిని అదుపు చేయడంలో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు.

పులికి ఎలాంటి హాని జరగకుండా చర్యలు..

వన్యప్రాణి అయిన పులికి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని జరగకుండా సురక్షితంగా బంధించాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. పులి జాడ తెలిసినప్పటికీ దానికి ఎలాంటి నష్టం కలగకుండా మత్తు ఇంజక్షన్‌తో అదుపులోకి తీసుకుని తిరిగి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టడమే అటవీ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు.

గతంలో రాజమండ్రి సమీపంలో పట్టుబడిన ఇదే పులిని ట్రాకర్ కాలర్ అమర్చి పాపికొండల అడవిలో వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ఆ ట్రాకర్ ద్వారానే ప్రస్తుతం పులి కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. మూడు నెలలపాటు అధికారులకు ముప్పు తిప్పలు పెట్టిన తర్వాత పట్టుబడిన ఈ పులి, ట్రాకర్ అమర్చిన అనంతరం తిరిగి అదే మార్గంలో పోలవరం ప్రాంతానికి చేరుకుని, గత వారం రోజులుగా రిస్క్యూ బృందానికి సవాల్ విసురుతోంది.

పోలవరం ప్రాంతం నుంచి సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకున్న పులి, శనివారం మర్లగూడెం అడవి నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి జంగారెడ్డిగూడెం పరిసర తోటల్లో సంచరిస్తోంది.

డ్రోన్లు, ట్రాకర్‌తో గాలింపు..

ట్రాకర్ సంకేతాల ఆధారంగా పులి కదలికలను గమనిస్తున్న అధికారులు, అది సమీపానికి వస్తే మత్తు ఇంజక్షన్‌తో అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక గన్‌లను సిద్ధం చేశారు. అలాగే బోనును ఏర్పాటు చేసి సరైన అవకాశంకోసం వేచి చూస్తున్నారు. డ్రోన్ల సహాయంతో కాలువలు, గట్లు, తోటల పరిసరాల్లో విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నారు.

ఫీల్డ్‌లోనే ఉన్నతాధికారులు..

జంగారెడ్డిగూడెం రూరల్ మండలం మైసన్నగూడెం శివారులోని జల్లేరు వాగు సమీపంలో రోజంతా రాజమహేంద్రవరం అటవీ కన్జర్వేటర్ జ్యోతి, ఏలూరు డీఎఫ్‌వో సందీప్ రెడ్డి, స్థానిక ఎఫ్‌ఆర్‌వో దుర్గాకుమార్ బాబు తదితర అధికారులు పర్యవేక్షించారు. వారితో పాటు కర్ణాటక రిస్క్యూ టీమ్ సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది కలిపి సుమారు 50 మంది అక్కడే మకాం వేశారు.

మత్తు ఇంజక్షన్ గన్‌లు, ట్రాకర్ రిసీవర్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచిన అధికారులు, పులిని సురక్షితంగా బంధించి తిరిగి అడవిలో విడిచిపెడతామని తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి కూడా పులి ఓ పశువును చంపినట్లు సమాచారం.