నిజామాబాద్ జీజీహెచ్‌కు సూపర్ స్పెషాలిటీ హోదా

  • రిఫరల్ ఆస్పత్రిగా అభివృద్ధి..
  • గుండె, న్యూరో, కిడ్నీ వైద్య సేవలు దశలవారీగా

హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని (జీజీహెచ్) రిఫరల్ ఆస్పత్రిగా అభివృద్ధి చేసి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ ప్రకటించారు. సోమవారం సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

జీజీహెచ్‌లో గుండె (కార్డియాలజీ), న్యూరాలజీ, మూత్రపిండాల (నెఫ్రాలజీ), మూత్రవ్యవస్థ (యూరాలజీ) విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్ఐ యంత్రాన్ని ఏర్పాటు చేసి, త్వరలోనే రోగులకు ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

సమీక్షలో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఉప ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది లభ్యత, అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ జీజీహెచ్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల కోసం ప్రజలు ప్రతిరోజూ ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తే హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రులపై రోగుల భారం తగ్గుతుందని సూచించారు.

అంకాపూర్‌లో కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని వచ్చిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే నందిపేట్ పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా (సీహెచ్‌సీ) అప్‌గ్రేడ్ చేయడం, ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

జిల్లాలో వైద్యుల కొరతను త్వరలోనే తీర్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో నిపుణులైన వైద్యుల నియామక ప్రక్రియను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి.