సుంకేశ్వరిలో వైభవంగా లక్ష్మమ్మ అవ్వ రథోత్సవం

భక్తుల జైజైధ్వానాల మధ్య గ్రామ వీధుల్లో అమ్మవారి రథయాత్ర

మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో గ్రామదేవత లక్ష్మమ్మ అవ్వ వార్షిక రథోత్సవాన్ని భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజలు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు జరిగాయి.

ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, మంగళహారతులు ఘనంగా నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు “అమ్మ తల్లి జై” నినాదాలతో రథాన్ని లాగుతూ భక్తిభావాన్ని చాటుకున్నారు.

రథోత్సవం సందర్భంగా గ్రామ మహిళలు పిండి వంటలు, పాయసం తదితర నైవేద్యాలను సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉత్సవం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాధవరం ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.