ఓటు మిస్సైనా ఆందోళన వద్దు..

  • ఆగస్టు 30 వరకు మరో అవకాశం
  • అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల
  • క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు గడువు
  • ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలి
  • ఎస్‌ఐఆర్ తర్వాత కూడా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
  • డబుల్ ఎంట్రీలు, సవరణలపై పారదర్శక ప్రక్రియ కొనసాగుతుంది
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశ

విజయవాడ, ఆంధ్రప్రభ: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తున్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటు నమోదు, సవరణలు చేసుకోవాలని సూచించారు.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో 2002 నుంచి నమోదైన ఓటర్ల వివరాలను ప్రస్తుత జాబితాతో అనుసంధానం చేసి, మొత్తం 29,361 డబుల్ ఎంట్రీలను గుర్తించి ముసాయిదా జాబితా రూపొందించినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడమే ఈ ప్రక్రియ లక్ష్యమన్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా, చిరునామా మారినా సంబంధిత బీఎల్‌ఓ, తహశీల్దార్, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓ కార్యాలయాల్లో ఆగస్టు 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పొరపాటున మరణించిన వారిగా నమోదు చేసినా లేదా పేరు తొలగించినా ఫారం-6 ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చని, రెండు చోట్ల ఓటు ఉన్నవారు ఫారం-8 ద్వారా కావాల్సిన నియోజకవర్గానికి బదిలీ చేసుకోవచ్చని వివరించారు.

జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, విచారణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించని వారికి నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోగా వివరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, విద్యా ధ్రువపత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలతో ఓటరు నమోదు లేదా ధ్రువీకరణ చేసుకోవచ్చని సూచించారు.

అన్ని క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం అక్టోబర్ 3, 2026న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని పేర్కొంటూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు ఫారం-6, అనెక్సర్-డి సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి అవసరమైన సవరణలు గడువులోగా పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.