జీజీహెచ్‌లో డైట్ విభాగంపై ఆకస్మిక తనిఖీ…

జీజీహెచ్‌లో డైట్ విభాగంపై ఆకస్మిక తనిఖీ…

ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సూపరింటెండెంట్ ప్రత్యేక దృష్టి.

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు గురువారం ఆసుపత్రిలోని డైట్ విభాగం (వంటశాల)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలలో ఆహారం తయారీ విధానం, నిల్వ వ్యవస్థ, పరిశుభ్రత ప్రమాణాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యతను అంచనా వేసేందుకు స్వయంగా వండిన ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం వార్డుల్లో రోగుల సహాయకులతో మాట్లాడిన సూపరింటెండెంట్, భోజనం సమయానికి అందుతున్నదా, రుచిగా ఉందా, నాణ్యత ఎలా ఉందని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, డైట్ విభాగం సిబ్బంది పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రతి రోగికి నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందేలా చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకట రమణ, హెల్త్ ఇన్‌స్పెక్టర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply