జగన్‌పై అచ్చెన్న ఫైర్!

  • వైసీపీ రైతులను మార్కెట్‌కు వదిలేసింది..
  • కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది

అమరావతి, ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 12.93 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి రైతులను మార్కెట్ కరుణకు వదిలేసిందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొగాకు రైతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని చర్యలు ప్రారంభించిందని తెలిపారు. గత ఏడాది 25 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకును రూ.270 కోట్ల విలువతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని చెప్పారు.

ఎఫ్‌సీవీ (వర్జీనియా) పొగాకు రైతులకు లో, ఆఫ్‌ స్టైల్ రకాల పొగాకుపై కిలోకు రూ.10 ప్రోత్సాహకం అందిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే 100 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యంగా చర్యలు చేపట్టామని, ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు అందించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

ఆగస్టు 15 వరకు పంటల బీమా గడువు

రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఖరీఫ్-2026 పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం సాధ్యమైందన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి పరిస్థితుల్లో పంటల బీమా రైతులకు కీలక రక్షణగా నిలుస్తుందని పేర్కొంటూ, రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా ప్రతి అర్హ రైతు బీమా పథకంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మాటలతో కాదు.. చేతలతో రైతులకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.