హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సహజ వరద కాలువలను ఆక్రమించడం, మార్గాలను మార్చడం, పైపులు వేసి వాటిపై రహదారులు నిర్మించడం వంటి చర్యలతో వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని పలువురు కాలనీవాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 52 ఫిర్యాదులు అందగా, వాటిని పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సంబంధిత అధికారులకు విచారణ చేసి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇటీవల తెలంగాణ హైకోర్టు, కోర్టు ధిక్కరణ కేసుల విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారం రోజుల వ్యక్తిగత సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. కేరళ పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన, సోమవారం నిర్వహించిన ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి హాజరై బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన తర్వాత ఆయన మొదటిసారిగా విధుల్లోకి రావడం విశేషం. అయితే, కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం నుంచి తదుపరి పరిపాలనా నిర్ణయం వెలువడాల్సి ఉంది.
ప్రజావాణిలో ఎక్కువగా వరద కాలువల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పార్కుల ఆక్రమణలు, నాలాల పునరుద్ధరణ, వర్షపు నీటి పారుదల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే నమోదయ్యాయి.
అమీన్‌పూర్ పెద్ద చెరువులోని 50 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 20 వరకు లేఔట్లు మునిగిపోయాయని, ప్లాట్ల యజమానులకు టీడీఆర్ ద్వారా తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు ప్లాట్ యజమానులు విజ్ఞప్తి చేశారు. అలాగే నివాసాలకు వెళ్లే దారులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని కూడా ఫిర్యాదులు అందాయి.
ప్రధాన ఫిర్యాదులు ఇవే…
బేగంపేట మెథడిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వర్షపు నీటి కాలువను భూగర్భ పైప్‌లైన్‌గా మార్చి, దానిపై సుమారు ఎనిమిది అడుగుల మేర భూమిని ఎత్తు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో భవిష్యత్తులో కాలువల్లో పూడిక తొలగింపు పనులు కష్టతరమవుతాయని పేర్కొంటూ సాంకేతికంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
హయత్‌నగర్ మండలం రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్-2లోని సర్వే నంబర్ 189/1లో 1983లో ఏర్పాటైన లేఔట్‌లో పార్కు కోసం కేటాయించిన సుమారు ఆరు ఎకరాల భూమిని కొందరు నకిలీ పత్రాల ఆధారంగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. గతంలో జీహెచ్‌ఎంసీ అధికారులు పార్కు స్థలంగా గుర్తించినప్పటికీ ఆక్రమణలు కొనసాగుతున్నాయని తెలిపింది.
రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ప్రముఖ్ టౌన్‌షిప్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ప్రముఖ్ టౌన్‌షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. సంబంధిత సర్వే నంబర్లపై సమగ్ర విచారణ జరపాలని కోరింది.
కొండాపూర్ సైబర్ విలేజ్‌లో వరద, మురుగు కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో స్వల్ప వర్షానికే కాలనీలో నీరు నిలిచిపోతోందని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలోని ముత్తంగి నాలా ఉపకాలువను గతంలో ఉన్న విధంగానే పునరుద్ధరించాలని డివైన్ వెంచర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కోరింది. నాలాను మళ్లించడం, ఆక్రమణల కారణంగా వెంచర్‌కు రహదారి అనుసంధానం దెబ్బతినడంతో పాటు వర్షపు నీటి పారుదల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్ని ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తూ, సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
