Forest Retirement | అటవీ సేవలకు ఘన వీడ్కోలు
Forest Retirement | అటవీ సేవలకు ఘన వీడ్కోలు
Forest Retirement | కర్నూలు బ్యూరో – ఆంధ్రప్రభ : అటవీ శాఖలో 36 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన జీడి మద్దిలేటి ఆదివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు సభలో అధికారులు, సిబ్బంది ఆయనతో పాటు ఆయన సతీమణిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

కార్యక్రమానికి కడప జిల్లా అటవీ అధికారి వీణిత కుమార్, ఉప అటవీ అధికారి (సబ్ డీఎఫ్‌వో) స్వామి వివేకానంద, స్పెషల్ ఫారెస్ట్ విభాగం ఉప రేంజ్ అధికారి టి. నాగరాజు, అటవీ పరిధి అధికారి (ఎఫ్‌ఆర్‌వో) ప్రసాద్, వనపెంట అటవీ పరిధి అధికారి సుబ్బయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ అటవీ పరిధి అధికారి రామ్‌లా నాయక్, రాజంపేట జూనియర్ అసిస్టెంట్ చంద్ర, పదవీ విరమణ పొందిన అటవీ గార్డు భాస్కర్ కుటుంబ సభ్యులు, అటవీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు మద్దిలేటి అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ సంపద కాపాడడంలో ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో విధులు నిర్వహించి సహోద్యోగులకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు, శ్రీశైలం, కర్నూలుతో పాటు కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు హోదాల్లో పనిచేసిన మద్దిలేటి అటవీ శాఖ అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. అడవుల పరిరక్షణలో ఆయన చూపిన అంకితభావం చిరస్మరణీయమని అన్నారు.
సన్మానానికి స్పందించిన మద్దిలేటి, తనకు సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, అటవీ సంపద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, అధికారులు మద్దిలేటి దంపతులకు జ్ఞాపికలు, శాలువాలు అందజేసి ఘనంగా సత్కరించారు.
