పీజీఆర్ఎస్‌లో 189 వినతులు స్వీకరణ
- పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి
- ప్రతి అర్జీదారుతో మాట్లాడిన తర్వాతే నివేదికలు ఇవ్వాలి
- భూ, సర్వే సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి చర్యలు వేగవంతం చేయాలి
- ఎరువుల పంపిణీ, ఫార్మ్ పాండ్స్ పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు
- 1100, సీఎంఓ ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యంతో స్పందించాలి
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ శ
విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 189 వినతులను స్వీకరించారు.
వీటిలో అత్యధికంగా 78 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవే కావడం గమనార్హం. ప్రతి వినతిని నిర్దేశిత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేక ప్రాధాన్యంతో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి అర్జీదారుతో నేరుగా మాట్లాడిన అనంతరమే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలు సకాలంలో పరిష్కరించకపోవడం వల్లే ఒకే అంశంపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
జిల్లాలో భూ వివాదాలు, సర్వే సమస్యలు అధికంగా వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ పోర్టల్‌తో పాటు 1100 టోల్‌ఫ్రీ సేవ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని సూచించారు. మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారమైతే కలెక్టరేట్‌కు వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని ఎరువుల దుకాణాలు, సహకార సంఘాలు ఉదయం 6 గంటలకే తెరవాలని ఆదేశించారు.
రైతుల కోసం టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ధరల పట్టికలు, కలెక్టరేట్ ఫోన్ నంబర్లు ప్రదర్శించాలని సూచించారు. ఎరువుల అక్రమ రవాణా, డైవర్షన్లను అరికట్టేందుకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. భూగర్భ జలాల పెంపునకు ఫార్మ్ పాండ్స్ కీలకమని పేర్కొంటూ, మంజూరైన అన్ని ఫార్మ్ పాండ్స్ పనులను వచ్చే నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆర్‌డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆత్కూరు గ్రామానికి చెందిన కౌలు రైతులకు సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్‌సీ కార్డులు) పంపిణీలో ఆలస్యం చేయరాదని స్పష్టం చేస్తూ, అదే రోజు కార్డులు జారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహ, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి. జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
