వార్డుల పెంపు నోటిఫికేషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

పురపాలక ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక నిలుపుదల

పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ: మాచర్ల పురపాలక సంఘంలో వార్డుల సంఖ్యను 31 నుంచి 36కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన డబ్ల్యూపీ నెం. 21510/2026 సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ ధర్మాసనం ముందు జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది రామ లక్ష్మణ రెడ్డి సనేపల్లి వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, వార్డుల పెంపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మాచర్ల పురపాలక సంఘానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు. అయితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడంతో, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కేసు తదుపరి విచారణ వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.