నకిలీ నియామక లేఖలపై సీఐడీకి ఫిర్యాదు
- డబ్బులు అడిగితే నమ్మొద్దు..
- నిరుద్యోగులకు అధికారుల హెచ్చరిక
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ నియామకాల మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ చిహ్నాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముద్రలు, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పేరు, మంగళగిరిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ చిరునామాను అక్రమంగా ఉపయోగించి నకిలీ నియామక ప్రకటనలు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు రూపొందించి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డి. ప్రకాష్ రావు డీజీపీ కార్యాలయంలోని సీఐడీ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్‌కు రాతపూర్వకంగా సోమవారం ఫిర్యాదు చేశారు.
అధికారిక వెబ్ సైట్ చూడాలి
వాట్సాప్, ఈ-మెయిల్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ ఉద్యోగ ప్రకటనలు పంపించి, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగులనుoచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఉద్యోగం కోసం ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, సర్టిఫికెట్ ధ్రువీకరణ పేరుతో ఎలాంటి మొత్తాలు చెల్లించవద్దని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాలు కేవలం ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక మండలి (ఏపీఎంఎస్‌ఆర్‌బీ), జిల్లాల్లో కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు జరుగుతాయని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు, దరఖాస్తులు, ఇంటర్వ్యూలు, ఫలితాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పద సందేశాలు, నకిలీ నియామక లేఖలు అందినట్లయితే వెంటనే పోలీసులకు లేదా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
