ఆలయ ప్రదర్శనల ఎంపికలో పారదర్శకత
కలెక్టర్ లక్ష్మిషాకు బీజేపీ నేతల వినతి
పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు టీటీడీ సహా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనల ఎంపికకు పారదర్శక విధానాన్ని రూపొందించాలని బీజేపీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిషాకు వినతిపత్రం సమర్పించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనతా వారధి జిల్లా కన్వీనర్ పిట్టల గోవింద సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని ఆలయాలను సాంస్కృతిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, టీటీడీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో సాంస్కృతిక ప్రదర్శనల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ శిరీష, మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ మన్నవ రమ, సెంట్రల్ నియోజకవర్గ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రాంక, పెద్దపాటి చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
