త్రాగునీటి పథకాల బిల్లుల చెల్లింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

త్రాగునీటి పథకాల బిల్లుల చెల్లింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : వేసవి నేపథ్యంలో జిల్లాలో త్రాగునీటి పథకాలకు సంబంధించిన, బిల్లుల చెల్లింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. సోమవారం మండలం కౌకుంట్లలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి, అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తో మంత్రి పయ్యావుల కేశవ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ బోర్డు, శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకంకు సంబంధించిన బిల్లులు, వర్కర్ల సమస్యలు, జీత భత్యాలు, ఆర్డబ్ల్యుఎస్ కింద సిపిడబ్ల్యు పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో జిల్లాలో ఎలాంటి త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా శ్రీ సత్యసాయి వాటర్ బోర్డు, శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకం, సిపిడబ్ల్యు పథకాలకి సంబంధించిన బిల్లులు, జీత భత్యాల చెల్లింపు చేపట్టాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు చేసి త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సరఫరాలో ఎక్కడైనా సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Leave a Reply