2026 TET | పేపర్ లీక్‌తో మహారాష్ట్రలో కీలక నిర్ణయం

2026 TET | పేపర్ లీక్‌తో మహారాష్ట్రలో కీలక నిర్ణయం

2026 TET | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో టీచర్స్ టెట్ (TET-2026) పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఘటన కలకలం రేపింది. ఆదివారం నిర్వహించాల్సిన పరీక్షకు సంబంధించిన పేపర్ పరీక్షకు ఒక రోజు ముందే బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, పరీక్ష నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండేందుకు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,028 పరీక్షా కేంద్రాల్లో జూన్ 28న టెట్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్షను నిలిపివేస్తున్నట్లు పరీక్ష నిర్వహణ మండలి ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భివండీ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రశ్నపత్రం ఎలా లీకైంది? దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేపర్ లీక్‌కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.