హసన్ పర్తికి చెందిన యువ పైలెట్ సుమంత్ మృతి
హసన్ పర్తికి చెందిన యువ పైలెట్ సుమంత్ మృతి
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : దక్షిణాఫ్రికాలో జరిగిన విమాన శిక్షణలో హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన ఆడెపు సుమంత్ (22)మృతి చెందిన ఉదంతం ఇది. ఈసంఘటన సమాచారంతో కుటుంబ సభ్యులు శోకతప్తులయ్యారు. వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడెపు చంద్రమోహన్, వరలక్ష్మీలు వ్యాపార నిమిత్తం హసన్ పర్తి మండల కేంద్రంలో స్ధిర పడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరి చిన్న కుమారుడైన సుమంత్ ఫైలెట్ కావాలనే కోరిక ఉండేది. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని జొహన్నాస్బర్గ్లో గత ఏడాది పైలెట్ శిక్షణ పొందేందుకు వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అక్కడ పైలెట్ శిక్షణలో భాగంగా శిక్షణ విమానాన్ని నడుపుతున్న సమయంలో, ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. ఈసం ఘటనలో త్రీవ్ర గాయాలతో సుమంత్ మృతి చెందినట్లు తెలిసింది. చిన్నప్పటి నుంచే పైలెట్ కావాలనే లక్ష్యంతో కృషి చేసిన సుమంత్, ఉన్నత శిక్షణ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లగా.. అక్కడ నెలకొన్న ప్రమాద సంఘటనతో కలల రెక్కలు ముక్కలయ్యాయి.
సుమంత్ ఆకస్మికంగా మరణించడంతో.. తల్లిదండ్రులు చంద్రమోహన్, వరలక్ష్మీ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించడంతో స్థానికులను కలిచి వేసింది. మండల కేంద్రంతో పాటు సీతంపేటలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.ఈ సమాచారంతో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మృతి చెందిన కుటుంబ సభ్యులను పోన్ లో పరామర్శించారు. సుమంత్ మృతదేహన్ని దక్షిణ ఆఫ్రికా నుండి తీసుకరావడానికి ప్రయత్నిస్తానని కుటుంబ సభ్యులకు హమీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే 66వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీదర్ మృతుడు సుమంత్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
