రాత్రికి రాత్రే ఇద్దరు బాలికల ఆచూకీ..

సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

ఎస్పీ పర్యవేక్షణలో 20 ప్రత్యేక బృందాల గాలింపు..

సోషల్ మీడియా సహకారంతో విజయవంతమైన ఆపరేషన్

అనంతపురం క్రైమ్, ఆంధ్రప్రభ : జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు బాలికలను రాత్రికి రాత్రే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో అనంతపురం జిల్లా పోలీసులు విజయవంతమయ్యారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణలో సుమారు 20 ప్రత్యేక బృందాలు రాత్రంతా గాలింపు చేపట్టి బాలికలను సురక్షితంగా గుర్తించాయి.

కూలీ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన ఎస్పీ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

స్పెషల్ బ్రాంచ్ సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సత్రాలు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. బస్ డిపోల అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లను అప్రమత్తం చేసి బాలికల వివరాలను అందజేశారు.

కర్ణాటకలోని బళ్లారి పోలీసులు, పుట్టపర్తి జిల్లా పోలీసులు, గుంతకల్లు–బళ్లారి రైల్వే పోలీసులు కూడా గాలింపు చర్యల్లో భాగస్వాములయ్యారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు బాలికల జాడను అన్వేషించగా, వారు రాయదుర్గం వైపు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం లభించింది.

బాలికల వివరాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంతో రాయదుర్గం పట్టణంలోని మేధర వీధిలో ఉన్న వారిని స్థానికుడు అగ్రహారం కిరణ్ గుర్తించి తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో రాయదుర్గం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని బాలికలను సురక్షితంగా స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

పిల్లలు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై జిల్లా ఎస్పీతో పాటు గాలింపులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో జిల్లా పోలీసుల వేగవంతమైన స్పందనపై ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేశారు.