రైతు సంక్షేమమే ధ్యేయం.. ప్రగతి బాటలో కేడీసీసీ బ్యాంక్..
రూ 12,456.77 కోట్ల వ్యాపారం..
రూ 82 కోట్ల నికర లాభంతో రాష్ట్రంలో అగ్రగామి
బలహీన పీఏసీఎస్ ఉద్యోగుల జీతాలకు రూ 4.43 కోట్ల డీఎల్‌ఎస్‌ఎఫ్ గ్రాంట్‌కు ఆమోదం..
రుణ బకాయిల రైతులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్..
మరణించిన రైతుల కుటుంబాలకు వడ్డీ మాఫీ
కొత్త శాఖలు, డిజిటల్ సేవల విస్తరణతో గ్రామీణ బ్యాంకింగ్‌కు మరింత బలం..
2026-27 వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక తీర్మానాలు..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రైతు సంక్షేమం, సహకార రంగ బలోపేతమే లక్ష్యంగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ బ్యాంక్) మరోసారి తన ఆర్థిక ప్రగతిని చాటుకుంది. 2026-27 వార్షిక సర్వసభ్య సమావేశంలో రైతులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చైర్మన్ నెట్టెం రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో వార్షిక నివేదిక, ఆడిట్ నివేదిక, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మొత్తం వ్యాపారాన్ని రూ 12,456.77 కోట్లకు పెంచడంతో పాటు రూ 82 కోట్ల నికర లాభం నమోదు చేసి రాష్ట్రంలో అగ్రగామి జిల్లా సహకార బ్యాంకుగా నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకు డిపాజిట్లు రూ 3,850.76 కోట్లు, రుణాలు రూ 8,606.01 కోట్లు చేరుకున్నాయని సీఈఓ శ్యామ్ మనోహర్ తెలిపారు. వరుసగా ఏ ఆడిట్ క్లాసిఫికేషన్ కొనసాగించడం బ్యాంకు ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు.
సమావేశంలో అత్యంత కీలక నిర్ణయంగా నాబార్డ్ మార్గదర్శకాల మేరకు ఆర్థికంగా బలహీనంగా ఉన్న పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం జిల్లా స్థాయి సహకార స్థిరీకరణ నిధి కింద రూ 4.43 కోట్ల గ్రాంట్ మంజూరుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం సహకార సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని చైర్మన్ వెల్లడించారు. రైతులకు మరింత ఊరట కల్పించేలా 2015కు ముందు రుణాలు తీసుకుని బకాయిల్లో ఉన్న రైతులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే రూ 3 లక్షల వరకు పంట రుణాలు తీసుకుని మరణించిన రైతుల కుటుంబాలకు వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానించింది.
వ్యవసాయం, పాడి, మత్స్య, పౌల్ట్రీ, ఉద్యానవనం, మహిళా సంఘాలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతతో రుణాలు అందిస్తున్నామని, పి ఎం ఈ జి పి, సూర్యఘర్, స్వయం ఉపాధి పథకాలు, విద్యా రుణాలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు రుణాలను కూడా విస్తృతంగా అందిస్తున్నట్లు చైర్మన్ వివరించారు. గ్రామీణ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించేందుకు ఇప్పటికే వెలటూరు శాఖను ప్రారంభించిన బ్యాంకు, త్వరలో సేరి లక్ష్మీపురం, రెడ్డిగూడెం శాఖలను ప్రారంభించనుంది. అదేవిధంగా ఊటుకూరు, మీర్జాపురం, చిల్లకల్లు, సింగరాయపాలెం ప్రాంతాల్లో కొత్త శాఖల ఏర్పాటుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
మూడు మొబైల్ బ్యాంకింగ్ వాహనాలు, మొబైల్ యాప్, యూపీఐ, క్యూ ఆర్ చెల్లింపులు వంటి డిజిటల్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ 2022-27 వేతన ఒప్పందాన్ని అమలు చేసి రాష్ట్రంలోనే తొలిసారిగా ఏరియర్స్‌తో సహా పెరిగిన వేతనాలు చెల్లించిన జిల్లా సహకార బ్యాంకు కేడీసీసీ బ్యాంకేనని చైర్మన్ పేర్కొన్నారు. అలాగే సొసైటీ అధ్యక్షులు, ఉద్యోగులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా 100 శాతం రుణ వసూళ్లు సాధించిన 61 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు, సీఈఓలు, ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఏపీకాబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట రామకృష్ణ మాట్లాడుతూ, రైతు సంక్షేమం, పారదర్శక పాలన, ఆర్థిక క్రమశిక్షణలో కేడీసీసీ బ్యాంకు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పీఏసీఎస్ అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
