డీఆర్డీఓకు ఆర్థిక అధికారాల బదిలీ-2026 విడుదల
- రక్షణ పరిశోధనలకు మరింత వేగం..
- ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తుందన్న రాజ్నాథ్ సింగ్
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పనితీరును మరింత సమర్థవంతంగా, వేగవంతంగా మార్చే లక్ష్యంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ‘డెలిగేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ పవర్స్ టు డీఆర్డీఓ–2026 (డీఎఫ్పీ-2026)’ను విడుదల చేశారు.
ఈ కొత్త విధానం ద్వారా వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) ప్రాజెక్టుల అమలు వేగవంతం కావడంతో పాటు జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతాయని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. డీఆర్డీఓ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ వేదికలు త్వరితగతిన సైన్యంలోకి చేరేలా ఈ విధానం దోహదపడుతుందని చెప్పారు. పరిశ్రమలు, విద్యాసంస్థలతో డీఆర్డీఓ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
డీఎఫ్పీ-2026 ద్వారా రక్షణ పరిశోధన విభాగంలోని వివిధ స్థాయిల అధికారులకు మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ముఖ్యంగా ప్రయోగాలు, పరీక్షలు, మూల్యాంకన కార్యక్రమాల కోసం ప్రత్యేక నిధుల కేటాయింపు, ప్రాజెక్టు ప్రారంభానికి ముందే పరిశోధనలకు ఆర్థిక అనుమతులు, బాహ్య పరిశోధన ప్రాజెక్టులు, డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్–సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ప్రాజెక్టులకు ప్రత్యేక ఆర్థిక అధికారాలను స్పష్టంగా నిర్వచించినట్లు తెలిపింది.
ఈ కొత్త విధానం రక్షణ సాంకేతిక రంగంలో స్వావలంబనను మరింత పెంచడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

