అన్నదాత సంస్కృతికి ప్రతీక ఏరువాక పౌర్ణమి

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్

లావేరు, ఆంధ్రప్రభ : రైతు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏరువాక పౌర్ణమి వ్యవసాయానికి కొత్త ఉత్సాహాన్ని నింపే పండుగ అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

సోమవారం లావేరు మండల కేంద్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో జిల్లా కలెక్టర్‌తో పాటు విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగలి పట్టి సంప్రదాయబద్ధంగా వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి, ఎద్దులు, నాగళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడం తనకు ఇదే మొదటిసారి అని తెలిపారు. నాగలి పట్టి సంప్రదాయ పద్ధతిలో సాగు ప్రారంభించడం ఆనందంగా అనిపించిందన్నారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తోందని, ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున దీర్ఘకాలిక పంటలకు బదులుగా తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యకరమైన పంటలతో పాటు భూసారం కూడా మెరుగుపడుతుందని చెప్పారు.

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు ఖరీఫ్ సాగుకు నాంది పలికే ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. నైరుతి రుతుపవనాల రాకతో రైతులు కొత్త సాగు పనులకు శ్రీకారం చుడతారని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా శాస్త్రీయ వ్యవసాయం, ఆధునిక యంత్ర పరికరాల వినియోగం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు విత్తనాలు, ఎరువులు సకాలంలో సరఫరా చేస్తోందన్నారు.

ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ, భూమిని తల్లిగా భావించి పూజలు చేసి కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది పలకడం మన సంస్కృతిలో భాగమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకుని ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలని కోరారు. జిల్లాలో 323 టన్నులకు పైగా విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నారాయణపురం, మడ్డువలస, తోటపల్లి ప్రధాన కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు చేపడుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుగుణాకరరావు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఐ. తోటయ్యదొర, ఏపీఎంఐపీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడీ సురేష్, ఏఎంసీ చైర్మన్ పద్మ, సచివాలయ సిబ్బంది, రైతులు, మహిళలు, యువత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.