సీషెల్స్ పర్యటన ముగించిన ప్రధాని మోదీ

  • రక్షణ, సముద్ర భద్రత సహా 19 కీలక ఒప్పందాలు..
  • హిందూ మహాసముద్ర భద్రతపై ఉమ్మడి దృష్టి

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల సీషెల్స్ పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో విస్తృత స్థాయి చర్చలు జరిపిన మోదీ.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు సురక్షిత, సుసంపన్న హిందూ మహాసముద్ర ప్రాంత నిర్మాణంపై ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్లే, భారతీయ ప్రవాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన మోదీ.. ఈ పర్యటన భారత్-సీషెల్స్ స్నేహాన్ని మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలను అందించిందని పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా రెండు దేశాల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం, సహకారంతో కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు అంకితం కానున్నాయని తెలిపారు.

శనివారం ప్రారంభమైన ఈ పర్యటనలో సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్, సీషెల్స్ మధ్య రక్షణ, సముద్ర భద్రత, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాలకు సంబంధించిన 19 కీలక సహకార ఒప్పందాలు ప్రకటించారు.

సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు న్యాయం, బాధ్యత, సమానత్వం అనే సూత్రాల ఆధారంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం చేసిన కృషికి గుర్తింపుగా సీషెల్స్ ప్రభుత్వం ప్రధాని మోదీకి అత్యున్నత గౌరవ పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ అవార్డును ప్రదానం చేసింది.

భారత్-సీషెల్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిన ఈ పర్యటన హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, అభివృద్ధి, సముద్ర సహకారానికి కొత్త ఊపునిచ్చిందని ఇరు దేశాలు పేర్కొన్నాయి.