Cyber Crime Hyderabad | అద్దెకు బాయ్‌ఫ్రెండ్’ వీడియోతో పోలీసు కేసు
Cyber Crime Hyderabad | అద్దెకు బాయ్‌ఫ్రెండ్’ వీడియోతో పోలీసు కేసు
Cyber Crime Hyderabad |వ్యూస్, లైకుల కోసం నైతిక విలువలకు తూట్లు
నిరాధార వీడియోలతో మరో యువకుడు చిక్కాడు
సైబర్ పెట్రోలింగ్‌తో పోలీసుల కఠిన చర్యలు
Cyber Crime Hyderabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేరుతో కొందరు చేస్తున్న చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలకు వ్యూస్, లైకులు సాధించడమే లక్ష్యంగా నైతిక విలువలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో మద్యం దొరికే రహస్య ప్రదేశాలు, ఆన్లైన్లోని అశ్లీల వీడియోల వెబ్సైట్ల వివరాలు, నగరంలో ఫలానా ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందంటూ మహిళలతో మాట్లాడుతున్న వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కేవలం ఫాలోవర్లను పెంచుకోవడానికి సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందనే కనీస విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ పూర్తిచేసి, మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేయాల్సింది పోయి సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అవ్వడానికి అడ్డదారులు తొక్కాడు. ‘అద్దెకు బాయ్‌ఫ్రెండ్…. లైంగిక సేవలు’ అంటూ సమాజం తలదించుకునేలా వీడియోలు రూపొందించాడు. కొద్ది రోజుల్లోనే వీటికి వ్యూస్, లైకులు విపరీతంగా వచ్చాయి. అయితే ఈ వ్యవహారాన్ని గమనించిన పోలీసులు, సదరు వీడియోలు వ్యభిచారాన్ని, అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్నాయని నిర్ధారించి, పలు కఠిన సెక్షన్ల కింద ఆ యువకుడి ఛానల్‌పై కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుర్రాడు డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. అమీర్‌పేటలోని ఒక రూమ్‌లో ఉంటూ అర్ధరాత్రి వేళల్లో స్నేహితులతో కలిసి తిరుగుతూ సరదాగా వీడియోలు చేయడం ప్రారంభించాడు. వీటికి ఆదరణ పెరగడంతో మరింత వేగంగా పాపులర్ అవ్వాలనే దురాశతో అడ్డదారి తొక్కాడు. నగరంలో ఫలానా ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందంటూ నిరాధారమైన వీడియోలను చిత్రీకరించి పోస్టు చేయడంతో చివరకు పోలీసుల నిఘాకు దొరికిపోయాడు.
అసభ్య పోస్టులు, కామెంట్లతో కూడిన వీడియోలు పెడుతూ పోలీసులకు చిక్కుతున్న వారిలో అత్యధికులు డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతులైన విద్యార్థులే కావడం గమనార్హం. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ తరహా అసాంఘిక, అసభ్యకర పోస్టుల ద్వారా సమాజంలో భిన్న వర్గాల మధ్య చిచ్చుపెట్టే వారిపై పోలీసులు నిఘా తీవ్రం చేశారు. ఇందుకోసం సైబర్ పెట్రోలింగ్‌ను విస్తృతం చేస్తూ, బాధితుల ఫిర్యాదులతో సంబంధం లేకుండా పోలీసులే సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. నేరం తీవ్రతను బట్టి కఠినమైన ఐటీ యాక్ట్, ఇతర క్రిమినల్ సెక్షన్లను జోడిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ పరిధిలోని నాలుగు కమిషనరేట్లలో కలిపి మొత్తం 456 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
