Jaipur Wall Collapse | గోడ కూలి.. ముగ్గురు మృతి
Jaipur Wall Collapse | గోడ కూలి.. ముగ్గురు మృతి
బేస్మెంట్ పనుల్లో విషాదం
Jaipur Wall Collapse | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : రాజస్థాన్లోని జైపుర్ నగరంలోని చందవాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బేస్మెంట్లో ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ ఒక్కసారిగా కూలిపోయింది.
గోడ కూలిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, కూలీలతో సహా 12 మందికి పైగా ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు స్పందన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతుండగా, చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
జిల్లా కలెక్టర్ సందేశ్ నాయక్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
