న్యాయస్థానం ముందు ముద్దాయిలంతా సమానులే
జైళ్లలో కుల, లింగ వివక్షకు తావివ్వొద్దు: కలెక్టర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : న్యాయస్థానం ముందు ప్రతి ముద్దాయి సమానుడేనని, కులం, లింగం, వైకల్యం వంటి అంశాల ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా స్పష్టం చేశారు. కారాగారాల్లో ఇటువంటి వివక్షపూరిత చర్యలకు పాల్పడితే అది చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు.
సోమవారం స్థానిక అంపోలులోని జిల్లా జైలును బోర్డ్ ఆఫ్ విజిటర్స్తో కలిసి వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు రికార్డుల్లో ఎక్కడా ఖైదీల కుల వివరాలను నమోదు చేయరాదని జైలు అధికారులను ఆదేశించారు.
జైలులో ఖైదీలకు అందిస్తున్న ఆహారం, పరిశుభ్రత ప్రమాణాలను స్వయంగా పరిశీలించిన అధికారులు, ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను రాతపూర్వకంగా లేదా నేరుగా సంప్రదించవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ, అర్హులైన ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు, న్యాయవాదిని నియమించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఖైదీలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ ఆకస్మిక తనిఖీలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ రమణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి గురుమూర్తి, జిల్లా విద్యాశాఖాధికారి ఏ. రవిబాబు, సాంఘిక సంక్షేమ, ఆర్ అండ్ బీ, ఉపాధి, వ్యవసాయ, పరిశ్రమల శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
