ఎన్బీడబ్ల్యూ ముద్దాయిలపై పోలీసుల ఉక్కుపాదం

కోర్టుకు గైర్హాజరైన ఇద్దరి అరెస్ట్..

జిల్లా జైలుకు తరలింపు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కోర్టు విచారణలకు హాజరుకాకుండా పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) అమలుపై కదిరి టౌన్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.

కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులకు సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరుకాని సుమారు 50 మంది ముద్దాయిలపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ వారెంట్ల అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో కదిరి టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 498(A), 323, 506 ఐపీసీ సెక్షన్ల కేసులో ముద్దాయిలుగా ఉన్న రాయచోటి పట్టణానికి చెందిన పూలంగిరి హసీనా, షేక్ గులాబ్ జామ్ కొంతకాలంగా కోర్టు విచారణలకు హాజరుకాకపోవడంతో వారిపై జారీ అయిన ఎన్బీడబ్ల్యూలను అమలు చేశారు.

ఇద్దరినీ అరెస్టు చేసి సంబంధిత కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో వారిని అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.

ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ముద్దాయిలు మరో రెండు మూడు రోజుల్లోగా స్వచ్ఛందంగా సంబంధిత కోర్టుల్లో హాజరు కావాలని పోలీసులు సూచించారు. లేనిపక్షంలో వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో పాటు కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలిస్తామని హెచ్చరించారు.

కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని, పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూ ముద్దాయిలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని కదిరి టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.