shamsabad airport | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ల్యాండింగ్‌కు అంతరాయం

shamsabad airport | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన ల్యాండింగ్‌కు అంతరాయం

లుఫ్తాన్సా పైలట్ ఫిర్యాదు
ల్యాండింగ్‌కు సిద్ధమైన విమానం కాక్‌పిట్‌పై లేజర్ కాంతులు
ఏటీసీకి సమాచారం అందించిన పైలట్.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

shamsabad airport | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో కాక్‌పిట్ వైపు లేజర్ లైట్ ప్రసరించడంతో పైలట్‌కు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఘటన అనంతరం పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. పైలట్ ఫిర్యాదు మేరకు విమానాశ్రయ అధికారులు, భద్రతా విభాగాలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. లేజర్ కాంతులు ఏ ప్రాంతం నుంచి ప్రసరించాయనే అంశంపై సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

విమానయాన నిపుణుల ప్రకారం, లేజర్ కాంతులు పైలట్ల కళ్లపై నేరుగా పడితే కొంతసేపు చూపు మందగించడం, దృష్టి మరలిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ వంటి అత్యంత కీలక దశల్లో ఇలాంటి ఘటనలు విమాన భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో లేజర్ లైట్ల వినియోగం అత్యంత ప్రమాదకరమని ఏటీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. విమానాల టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఉద్దేశపూర్వకంగా లేజర్ కాంతులు ప్రసరించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు బాధ్యులెవరు అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.