రాజకీయ కక్షలతో కుల బహిష్కరణ ఆరోపణలు
- పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటున్న బాధిత కుటుంబం
కన్నెపల్లి, ఆంధ్రప్రభ : రాజకీయ కక్షల నేపథ్యంలో ఓ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించారనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని జజ్జరవెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని భీంపూర్ గ్రామానికి చెందిన గుర్ల తనుబాయి బీసీ వర్గానికి చెందిన మహిళ. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు సభ్యురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. అదే గ్రామపంచాయతీలో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) మద్దతుతో పోటీ చేసిన వడుగూరు శాంత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఇద్దరూ ఒకే బారే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, సర్పంచ్ భర్త వడుగూరు చిన్నబాపు, మరికొందరు కుల పెద్దలు కలిసి తమ కుటుంబంపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారని తనుబాయి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని, లేకపోతే కులంలో జరిగే వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు ఆహ్వానించబోమని హెచ్చరించారని తెలిపారు.
అంతేకాకుండా, తమ కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా రూ.5 వేల జరిమానా విధిస్తామని కుల పెద్దలు బెదిరించారని ఆరోపించారు. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తనుబాయి కుటుంబం వాపోయింది. దీంతో తమపై ఒత్తిడి మరింత పెరిగిందని, సామాజికంగా పూర్తిగా వెలివేసి మానసికంగా వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి కొనసాగితే తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధితురాలి భర్త గుర్ల చందు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
