18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, ఆంధ్రప్రభ : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 23 నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమం ద్వారా ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభ మరింత పెంపొందుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.
అనంతరం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర జలాలను ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
