సింహవాహనంపై సుదర్శన నరసింహుడిగా కల్యాణ వేంకటేశ్వరుడు

సింహవాహనంపై సుదర్శన నరసింహుడిగా కల్యాణ వేంకటేశ్వరుడు
తిరుపతి కల్చరల్ ఆంధ్రప్రభ: శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో తిరువీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు.
ఉదయం 5.40 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా సాగి తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. మార్గమంతా భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళారతులు అర్పించారు.
రథోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా ఆత్మజ్ఞానాన్ని బోధించే తాత్త్విక సందేశాన్ని కూడా అందిస్తుంది. ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనసును పగ్గంగా, ఇంద్రియాలను గుర్రాలుగా, విషయాలను వీధులుగా భావించడం ద్వారా ఆత్మ–అనాత్మ వివేకాన్ని ఈ ఉత్సవం భక్తులకు తెలియజేస్తుంది.
రథోత్సవం అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ పండ్ల రసాలతో విశేష అభిషేకం చేశారు.
నేడు సాయంత్రం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
రథోత్సవంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, పోలీసు అధికారులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 31న కపిలతీర్థం (ఆళ్వార్ తీర్థం)లో చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం ఉదయం 6 గంటలకు స్వామివారు, అమ్మవార్లు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకీలో కపిలతీర్థానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు.
చక్రస్నానం అనంతరం పీఆర్ తోటకు వేంచేపు చేసి, సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
