తీవ్ర ఎండల నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి

తీవ్ర ఎండల నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి

హీట్ స్ట్రెస్‌తో కోళ్ల మరణాల ప్రమాదం : పశుసంవర్ధక శాఖ హెచ్చరిక

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో కొనసాగుతున్న తీవ్ర ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డి. ఉమా మహేశ్వరి సూచించారు.

అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కోళ్లలో హీట్ స్ట్రెస్ ఏర్పడి ఆహార స్వీకరణ తగ్గడం, గుడ్ల ఉత్పత్తి పడిపోవడం, ఎదుగుదల మందగించడం, ఆకస్మిక మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని శాఖాధికారులు, వెటర్నరీ వైద్యులు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు తమ పరిధిలోని పౌల్ట్రీ ఫారాలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఫారాల్లో పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. కోళ్ల షెడ్లలో గాలి ప్రసరణ సక్రమంగా ఉండేలా కర్టెన్లు, వైర్ మెష్ పూర్తిగా తెరిచి ఉంచాలని సూచించారు. అవసరమైతే ఫ్యాన్లు, ఎగ్జాస్ట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

షెడ్ల పైకప్పులకు తెలుపు రంగు లేదా ప్రతిఫలించే పెయింట్ వేయడం, కొబ్బరి ఆకులు లేదా వ్యవసాయ అవశేషాలతో కప్పడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించవచ్చని వివరించారు. షెడ్ల చుట్టూ షేడ్ నెట్‌లు, చెట్లు ఏర్పాటు చేసి చల్లదనం కల్పించాలని, తడి గోనె సంచులు లేదా ఫాగింగ్ వ్యవస్థలను వినియోగించాలని సూచించారు.

కోళ్లకు ఎల్లప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని, నీటిలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్–సి కలపడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చని తెలిపారు. ఉదయం, సాయంత్రం వంటి చల్లని సమయాల్లో మాత్రమే ఆహారం ఇవ్వాలని, మధ్యాహ్నం అధిక వేడి సమయంలో ఆహారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కోళ్లను అధిక సంఖ్యలో ఒకే షెడ్లో ఉంచకుండా తగిన స్థలం కల్పించాలని, తీవ్ర ఎండ సమయంలో వాటిని తరలించడం లేదా పట్టుకోవడం వంటి చర్యలు సాధ్యమైనంత వరకు నివారించాలని రైతులకు సూచించారు. జిల్లాలోని సంబంధిత అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలలోపు పౌల్ట్రీ పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

శాఖ సూచనలు పాటించడం ద్వారా కోళ్ల మరణాలు, ఆర్థిక నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని జేడీ డి. ఉమా మహేశ్వరి పేర్కొన్నారు.