కుప్పం రూరల్‌లో పారిశుద్ధ్యానికి కొత్త ఊపు
కుప్పం రూరల్‌లో పారిశుద్ధ్యానికి కొత్త ఊపు
తడి–పొడి చెత్త సేకరణకు ట్రక్కుల ప్రారంభం.. కుప్పం అభివృద్ధే సీఎం లక్ష్యం: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
కుప్పం, ఆంధ్రప్రభ : కుప్పం రూరల్ మండలంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రత్యేక ట్రక్కులను బుధవారం కుప్పం రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం హుడా చైర్మన్ డాక్టర్ సురేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ట్రక్కులకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
తడి, పొడి చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వం పారిశుద్ధ్యంపై చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు ఈ చర్యలు దోహదపడతాయని అన్నారు.
అంతకుముందు కుప్పం రూరల్ మండలానికి చేరుకున్న ఎంపీకి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు.
ఇప్పటికే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం వంటి రంగాల్లో కుప్పం ముందంజలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కుప్పం అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
గ్రామాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య మెరుగుదలకు ఈ ట్రక్కులు ఉపయోగపడతాయని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
