పసి ప్రాణం తీసిన క్వారీ గుంత….
పసి ప్రాణం తీసిన క్వారీ గుంత….
అక్రమ మట్టి తవ్వకాలతో ఆరేళ్ల చిన్నారి మృతి
ఘటన బయటకు రాకుండా మట్టి మాఫియా ప్రయత్నాలంటూ ఆరోపణలు
ఉమ్మడి గుంటూరు బ్యూరో/ ఆంధ్రప్రభ : ప్రత్తిపాడు నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఓ అమాయక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. గుంటూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని మట్టి తవ్వకాల గుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అధికారుల నిర్లక్ష్యం, అక్రమ మట్టి తవ్వకాల దందానే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృత బాలుడిని కటికల ఆనంద్ (6)గా గుర్తించారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన డేవిడ్, శిరీష దంపతులు కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుక కోసం నాయుడుపేట అంబేద్కర్ కాలనీకి వచ్చినట్లు సమాచారం. సాయంత్రం గ్రామంలోని మరో నలుగురు పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన ఆనంద్… మట్టి తవ్వకాల ప్రాంతానికి చేరుకున్నాడు.
అక్కడ లారీలు ఎక్కే మార్గం పైనుంచి ప్రమాదవశాత్తూ సుమారు 70 అడుగుల లోతున్న నీటి గుంతలో పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించేలోపే బాలుడు నీటిలో మునిగిపోయాడు. అనంతరం గ్రామస్థులు తీవ్ర ఆందోళన మధ్య గాలింపు చర్యలు చేపట్టగా బాలుడి మృతదేహం బయటపడింది.
అక్రమ మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలే ఈ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓబులనాయుడుపాలెం, నడింపాలెం, నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో అనుమతులకు మించి లోతుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పలుచోట్ల 60 నుంచి 70 అడుగుల లోతైన గుంతలు ఏర్పడ్డాయని చెబుతున్నారు.
వర్షపు నీటితో నిండిపోయిన ఈ గుంతలు చిన్న చెరువులను తలపిస్తూ గ్రామాల మధ్యే ప్రమాదకరంగా మారాయని స్థానికులు అంటున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు లేకుండా వదిలేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం ప్రజల్లో నెలకొంది.
ఇదిలా ఉండగా, ఘటన నిన్న సాయంత్రం జరిగినప్పటికీ విషయం బయటకు రాకుండా కొందరు మట్టి మాఫియా వ్యక్తులు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం సాగుతోంది. బాలుడి కుటుంబ సభ్యులతో మీడియాకు వివరాలు చెప్పొద్దంటూ కొందరు బేరసారాలు జరిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అక్రమ మట్టి తవ్వకాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాఫియా… ఇప్పుడు చిన్నారి మృతిపైనా ఒత్తిళ్ల రాజకీయాలు నడుపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు డేవిడ్, శిరీష దంపతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లల్లో ఆనంద్ చిన్నవాడని, కుటుంబానికి ఎంతో ముద్దుబిడ్డ అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. “పుట్టినరోజు వేడుకకు వచ్చి బిడ్డను కోల్పోతామని ఊహించలేదు” అంటూ కుటుంబ సభ్యులు విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర గుంతలను వెంటనే మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
