జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

కదిరిలో వడగళ్ల వాన.. పలు చోట్ల పిడుగులు

హిందూపురంలో అత్యధిక వర్షపాతం నమోదు

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అగళి మండలం మినహా జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలో రెండు మూడు ప్రాంతాల్లో పిడుగులు పడగా, కదిరిలో వడగళ్ల వాన కురిసింది. గత రెండు నెలలుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి.

కదిరిలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పడమర గోపురంపై పిడుగు ప్రభావం కనిపించింది. గోపురంపై ఏర్పాటు చేసిన మెరుపు నిరోధక వ్యవస్థ కారణంగా పిడుగు ప్రభావం పక్కకు మళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో భారీగా విద్యుత్‌ ప్రవాహం ప్రసరించినట్లు వారు పేర్కొన్నారు.

గతంలో కూడా దక్షిణ గోపురంపై పిడుగు పడటంతో కొంత భాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. అప్పట్లో కదిరికి చెందిన వెంకట్‌రెడ్డి అనే ఇంజనీర్‌ దక్షిణ గోపురానికి మెరుపు నిరోధక పరికరాన్ని అందించారు. ప్రస్తుతం ఆలయంలోని నాలుగు గోపురాలకు మెరుపు నిరోధక సదుపాయాలు ఉన్నప్పటికీ, వాటి నిర్వహణ పూర్తిస్థాయిలో జరగడం లేదని సమాచారం.

భారీ వర్షంతో ఆలయ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. ఇదే సమయంలో ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామ సమీపంలో తాటి చెట్టుపై పిడుగు పడినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

జిల్లాలో అత్యధికంగా హిందూపురంలో 54.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిబండలో 7.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నల్లచెరువులో 54.2 మిల్లీమీటర్లు, తలుపులలో 47.4, నల్లమాడలో 47.2, గాండ్లపెంటలో 46.4, కదిరిలో 45.2, గోరంట్లలో 45.2, పుట్టపర్తిలో 42.6, కనగానపల్లెలో 42.4, బుక్కపట్నంలో 39.6, సీకేపల్లిలో 38.8, తనకల్లులో 37.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అలాగే కొత్తచెరువులో 32.8, రామగిరిలో 32.6, ధర్మవరంలో 32.4, లేపాక్షిలో 27.0, అమరాపురంలో 25.8, చిలమత్తూరులో 25.8, అమడగూరులో 25.2, పెనుకొండలో 24.6, ఎన్‌పీకుంటలో 22.0, సోమందేపల్లిలో 21.0, పరిగిలో 19.6, బత్తలపల్లిలో 18.4, ఓడీసీలో 18.2, రొద్దంలో 11.2, తాడిమర్రిలో 10.2, ముదిగుబ్బలో 9.6, రొళ్లలో 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.