తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం..

తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం..

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం
ఈ విజయం ప్రతి ఒక్కరికి అంకితం

క్రోసూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరా వతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలుగువారి ఆత్మగౌరవానికి చారిత్రాత్మక ఘట్టమని పల్నాడు జిల్లా తెదేపా అధ్యక్షుడు జానీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నిర్ణయం కేవలం పరిపాలనా చర్య మాత్రమే కాకుండా ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి లభించిన చారిత్రాత్మక న్యాయమని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని, రైతుల త్యాగాలు, ప్రజల ఆశలు, యువత భవిష్యత్తు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చే దిశగా అడుగులు వేస్తున్నాయని తెలి పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మద్దతు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే అమరావతి చట్టబద్ధత సాధ్యమైందని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు. వారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 2015లో భూ సమీకరణ పథకం ద్వారా 28 వేలకు పైగా రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలకు పైగా భూమిని ఇచ్చి ప్రపంచంలోనే అరుదైన ప్రజా ఉద్యమానికి నాంది పలికారని ఆయన గుర్తు చేశారు.

భూమి రైతుకు ఆస్తి మాత్రమే కాక భావోద్వేగమని, అయినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు చేసిన త్యాగం అపూర్వమని కొనియాడారు. మూడు రాజధానులు ప్రతిపాదనతో గత ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి తీవ్రంగా దెబ్బతిందని, పెట్టుబడులు తగ్గడం, నిర్మాణాలు ఆగిపోవడం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని ఆయన విమర్శించారు. అయినప్పటికీ 1600 రోజులకు పైగా సాగిన రైతుల నిరసన పోరాటం అమరావతిపై ఉన్న ప్రజల నమ్మకాన్ని ప్రపంచా నికి చాటి చెప్పిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి అభివృద్ధి తిరిగి పట్టాలెక్కిందని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిపాలనా భవనాల నిర్మాణం, జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటుతో రాజధాని నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు.

దీనివల్ల వేలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తుండగా, యువతకు భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని తెలిపా రు. అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా తీర్చిదిద్దేం దుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని, ఒకే రాజధాని సమగ్ర అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

అమరావతి అభివృద్ధి చెందితేనే రా ష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు, అవకాశాలు చేరుతాయని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా నిలవడం ద్వారా రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని, గతంలో ఉన్న అనిశ్చితి, అనుమానాలకు ఇప్పుడు ముగింపు పలుకుతూ రాష్ట్రం అందమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోందని జానీ అన్నారు.

Leave a Reply