కంటి చూపును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత..
కంటి చూపును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత..
శుక్లాల సమస్యకు శస్త్రచికిత్సే శాశ్వత పరిష్కారం..
ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శుక్లాల (ముత్యబిందు) కారణంగా చూపు మందగించిన వారు ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్స చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శంకర నేత్రాలయ వైద్యులు డా. మాధవ్, డా. అపర్ణల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మనిషికి ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన వరాల్లో కనుచూపు ఒకటని అన్నారు. కంటి చూపు ద్వారా మనం ప్రపంచాన్ని దర్శించగలుగుతామని, విద్యాభ్యాసం, ఉపాధి, దైనందిన కార్యకలాపాలు, సామాజిక జీవనం సజావుగా సాగేందుకు చూపు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో శుక్లాలు (ముత్యబిందు) ఏర్పడడం సహజమని తెలిపారు.
శుక్లాలు వచ్చినప్పుడు వస్తువులు మసకగా కనిపించడం, చదవడంలో ఇబ్బంది కలగడం, వెలుతురు పట్ల అసౌకర్యం, రాత్రివేళల్లో సరిగా కనిపించకపోవడం, రంగులను స్పష్టంగా గుర్తించలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చూపు మరింత తగ్గిపోయి సాధారణ జీవనం కూడా కష్టతరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. శుక్లాలకు ప్రస్తుతం అత్యంత సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స శస్త్రచికిత్సేనని కలెక్టర్ తెలిపారు. శస్త్రచికిత్స ద్వారా మసకబారిన కంటి లెన్స్‌ను తొలగించి, దాని స్థానంలో కృత్రిమ లెన్స్‌ను అమర్చడం వల్ల చూపు గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అందుబాటులో ఉన్నాయని, కంటి చూపు సమస్యలు ఉన్న వారు సమీప ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కోరారు. శిభిరానికి సంబంధించి ఇతర వివరాలకు 9440029999 నంబర్ నందు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డా. వెలగ జోషి, సెక్రటరీ సీహెచ్. చిట్టిబాబు, సభ్యులు బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
