గోవధ నిషేధం చట్టాల నిబంధనలు పాటించాల్సిందే

గోవధ నిషేధం చట్టాల నిబంధనలు పాటించాల్సిందే
విజయవాడ, ఆంధ్రప్రభ
గోవధ నిషేధం, జంతు సంక్షేమ చట్టాలు (పీసీఏ యాక్ట్, 1960), రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా. ఎం.హనుమంతరావు, డీసీపీ కేజీవీ సరిత స్పష్టం చేశారు.శుక్రవారం కలెక్టరేట్లో బక్రీద్ సందర్భంగా జంతు వధపై చట్టపరంగా చేయదగినవి, చేయకూడని అంశాలపై జరిగిన సమావేశంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డా. ఎం.హనుమంతరావు, డీసీపీ కేజీవీ సరిత పాల్గొన్నారు.
సమావేశంలో ఈ అధికారులు మాట్లాడుతూ ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధమని, చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. లైసెన్సు లేని వధ శాలలో లేదా అనుమతి లేని ప్రదేశాల్లో పశువులను వధించకూడదని.. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్-1960 లేదా సంబంధిత నియమ నిబంధనలను ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, జంతు సంరక్షణ చట్టం, 1977ను సమర్థవంతంగా అమలు చేయడంపై జిల్లా, డివిజన్, మండలస్థాయి ప్రత్యేక కమిటీలు పనిచేయాలని సూచించారు. బక్రీద్ సందర్బంగా జిల్లాలో ఆహ్లాదకర వాతావరణంలో పండుగ జరుపుకునేలా జంతు హింస నివారణ చట్టాలు ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా జిల్లాస్థాయిలో మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్థక, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టాలు ఉల్లంఘనలు జరక్కుండా ప్రత్యేకంగా నిఘా పెట్టి పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఎ.శ్రీ పద్మ, ఎం.వెంకటేశ్వర్లు, గోవింద్ సాబూ, గో రక్ష సేవా సమితికి చెందిన వినోద్ కుమార్ రాజ్ పురోహిత్, గో పరివార జేఏసీకి చెందిన టి.సురేష్, గోశాల ఛైర్మన్ శివరావు, సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
