మేడ్చల్ పెద్ద చెరువులో కలకలం..

  • చెట్టుకు వేలాడుతున్న మృతదేహం
  • మృతుడి వివరాల కోసం పోలీసుల ఆరా..
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

మేడ్చల్, ఆంధ్రప్రభ: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరువు మధ్యలో ఉన్న ఓ చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం చేపల వేట కోసం చెరువులోకి వెళ్లిన మత్స్యకారులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే వారు మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మృతుడు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఆత్మహత్యా, ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు.