Srikakuleshwara Swamy | వైకుంఠ ఏకాదశమి కోసం..
Srikakuleshwara Swamy | వైకుంఠ ఏకాదశమి కోసం..
Srikakuleshwara Swamy, మోపిదేవి, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కార్యాలయంలో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడారు. ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువుతీరిన ఆంధ్ర మహావిష్ణువు దేవస్థానంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకులేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 30వ తేదీ మంగళవారం నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లను వివరించారు.
30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుందన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగంగా ఉదయం శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లకు సహస్రనామార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు ఆస్థాన పూజా కార్యక్రమం అనంతరం ఉత్తర ద్వార దర్శనం అనంతరం గరుడ వాహనం పై గ్రామోత్సవం నిర్వహిస్తాం అని చెప్పారు. రాత్రి 8 గంటలకు రాజాధిరాజ్యం పై గ్రామోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు, షామియానాలు, మంచినీరు, ఉచిత ప్రసాదం, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ సహకారంతో బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామన్నారు. పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఆలయానికి ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ, పూల అలంకరణ చేయనున్నట్లు దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు.
