ఇంద్రకీలాద్రిపై భక్తుల వెల్లువ..

కనకదుర్గమ్మకు కానుకల జల్లు..
ఒక్కరోజే 34,100 మందికి దర్శనం..
16 రోజుల్లో హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జూలై 6వ తేదీనే 34,100 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, మరోవైపు జూన్ 20 నుంచి జూలై 6 వరకు 16 రోజుల హుండీ లెక్కింపులో రూ.3.39 కోట్లకు పైగా ఆదాయం నమోదవడం అమ్మవారిపై భక్తుల అపార విశ్వాసాన్ని చాటింది. నగదుతో పాటు బంగారం, వెండి, 29 దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో సమర్పించడం విశేషం.

ఆలయ విశేషాలు…

జూలై 6న ఆలయంలో మొత్తం 34,100 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శన టికెట్ల ద్వారా 5,110 టికెట్లు జారీ అయ్యాయి. అదే రోజు 54,047 ప్రసాదాలు విక్రయించగా, రోజువారీ హుండీ ద్వారా రూ.3,90,751 విరాళాలు లభించాయి. 348 మంది వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనగా, 1,425 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 7,870 మంది అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఆషాఢ మాస విశేష పూజల నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు.

గణనీయంగా ఉండి ఆదాయం…

ఇదిలా ఉండగా, జూన్ 20 నుంచి జూలై 6 వరకు జరిగిన 16 రోజుల హుండీ లెక్కింపులో మొత్తం రూ.3,39,53,599 ఆదాయం నమోదైంది. ఇందులో నోట్ల రూపంలో రూ.3,23,81,599, నాణేల రూపంలో రూ.15,72,000 లభించాయి. అదనంగా 568 గ్రాముల బంగారం, 3 కిలోల 330 గ్రాముల వెండి భక్తులు కానుకగా సమర్పించారు. ఈ కాలంలో రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.21,22,099.94గా నమోదైనట్లు దేవస్థానం వెల్లడించింది. విదేశాల్లోని భక్తులు కూడా అమ్మవారిపై తమ భక్తిని చాటుతూ 29 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని హుండీల్లో సమర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ, యూరప్, ఇంగ్లాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల కరెన్సీ లభించింది. అలాగే చెలామణి నుంచి ఉపసంహరించిన రూ.2,000 విలువైన 5 నోట్లు, రూ.1,000 విలువైన 9 నోట్లు, రూ.500 విలువైన 74 పాత నోట్లు కూడా హుండీల్లో లభించాయి. దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ, పాలకమండలి సభ్యులు, దేవస్థాన అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, సేవకుల సమక్షంలో మహామండపం ఆరవ అంతస్తులో హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.