విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..

విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..

  • టీజీఎస్పీడీసీఎల్‌ మేడ్చల్ ఏఈ రాంబాబు…

మేడ్చల్, ఆంధ్రప్రభ : రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు, భారీ ఈదురు గాలులు, వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) అధికారులు హెచ్చరించారు. గురువారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని ప్రజలను ఉద్దేశించి విద్యుత్తు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. వర్షాల సమయంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడినా, విద్యుత్ స్తంభాలు కూలిపోయినా లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే 1912 హెల్ప్‌లైన్ నెంబరుకు సమాచారం అందించాలి అని తెలియజేశారు.

ప్రమాదకర పరిస్థితులపై సమీపంలోని TGSPDCL అధికారులకు కూడా తక్షణమే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజలు స్వయంగా విద్యుత్ వైర్లను లేదా ఇతర విద్యుత్ పరికరాలను తాకడం, తొలగించడం, లేదా మరమ్మత్తులు చేయడానికి ప్రయత్నించరాదు. నిబంధనలు ఉల్లంఘించి సొంతంగా మరమ్మత్తులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.ఏ సమయంలోనైనా విద్యుత్ అత్యవసర సహాయం కోసం 1912 నెంబరు అందుబాటులో ఉంటుందని, ప్రజల సేవలో ఎల్లప్పుడూ టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.