దాహార్తి తీరేదెన్నడూ…
- తాగునీటి కోసం బావుల బాట..
- ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై విమర్శలు
చింతలపూడి, ఆంధ్రప్రభ: ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు చింతలపూడి మెట్ట ప్రాంతంలో వినిపిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి బావుల నుంచి నీరు తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు.
చింతలపూడి మండలంలో 60కు పైగా గ్రామాలు ఉన్నప్పటికీ, పలు గ్రామాలకు ఇప్పటికీ క్రమబద్ధమైన తాగునీటి సరఫరా అందడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులు ఉన్నా నీటి సరఫరా లేక అలంకారప్రాయంగా మారాయని ఆరోపిస్తున్నారు.
మండలంలోని మల్లయ్యగూడెం పంచాయతీ పరిధిలోని ఎస్సీ అగ్రహారంలో ఏళ్లుగా తాగునీటి సమస్య కొనసాగుతోంది. గ్రామస్తులు ప్రతిరోజూ కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి నుంచి నీటిని తోడుకుని తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.
వర్షాకాలంలో కలుషిత నీటిని వినియోగించాల్సి వస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నప్పటికీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీరు సరఫరా చేస్తున్న గ్రామాల్లో కూడా నీటికి క్లోరినేషన్ చేయడం లేదని, మోటార్లు చెడిపోతే మరమ్మతులు ఆలస్యమవుతున్నాయని చెబుతున్నారు.
అదేవిధంగా పలు గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రహదారులపై చేరి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్, ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మారుమూల గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, సీఎం చంద్రబాబు ప్రకటించిన “ఇంటింటికీ కుళాయి నీరు” లక్ష్యం ఆచరణలో కనిపించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
