రామాలయంలో వెండి కిరీటాల చోరీ కేసు ఛేదన..
రామాలయంలో వెండి కిరీటాల చోరీ కేసు ఛేదన..
- ఇద్దరు అరెస్ట్, 13 తులాల వెండి స్వాధీనం
బీర్‌పూర్, ఆంధ్రప్రభ : సారంగాపూర్ మండలంలోని ఓ రామాలయంలో జరిగిన వెండి కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి, 13 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, సారంగాపూర్ మండలంలోని రామాలయంలో ఈ ఏడాది మే 25న వెంకటేశ్వరస్వామికి చెందిన సుమారు 15 తులాల బరువున్న రెండు వెండి కిరీటాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న సారంగాపూర్ గ్రామానికి చెందిన తునికి గంగాచారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో గంగాచారి తాను మద్యానికి బానిస కావడంతో, డబ్బుల కోసం ఆలయంలోని రెండు వెండి కిరీటాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఆ కిరీటాలను జగిత్యాలకు తీసుకెళ్లి కట్టా లక్ష్మణాచారి సహాయంతో ముక్కలుగా కట్ చేయించినట్లు తెలిపాడు.
తర్వాత ఆ వెండిని జగిత్యాలకు చెందిన పుదలే గణేష్ వద్ద కరిగించగా, అందులోని 2 తులాల వెండిని విక్రయించి వచ్చిన డబ్బుతో మద్యం సేవించినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి 13 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీకి సహకరించి వెండి కిరీటాలను ముక్కలుగా చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సారంగాపూర్ ఎస్‌ఐ పి. గీత మాట్లాడుతూ, దొంగతనాలకు పాల్పడిన వారిపైనే కాకుండా, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని సూచించారు.
